||భగవద్గీత ||

||నాలుగవ అధ్యాయము ||

||జ్ఞాన యోగము - శ్లోకాల సారాంశము ||

|| Om tat sat ||

భగవద్గీత
నాలుగవ అధ్యాయము
జ్ఞాన యోగము - "చాతుర్వర్ణ్యం మయా సృష్ఠమ్ "

ఈ శ్లోకము లో నాలుగు వర్ణముల గురించి కృష్ణుడు చెపుతాడు . అ శ్లోకము లో మొదటి పాదము :

"చాతుర్వర్ణ్యం మయా సృష్ఠమ్ గుణ కర్మ విభాగయోః"
"ఈ నాలుగు వర్ణములూ నా చేత వారి వారి గుణములబట్టి విభజించబడినవి" అని.

అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు , వైశ్యుడు ,శూద్రుడు అన్నవి వారి గుణములబట్టి కర్మల బట్టి అని -

అంటే గీత ప్రకారము ఈ వర్ణాలు పుట్టుకతో వచ్చిన బిరుదులు కావని , వారి గుణములబట్టి వారు చేసే కర్మల బట్టి వచ్చిన విభజన అని తెలుస్తోంది.

గుణములన్నవి సాత్విక, రజో , తామసిక గుణములు. ఇవి వంశ పారంపర్యముగా వచ్చు గుణములు కావు. ఇవి స్వతహాగా జన్మముతో వచ్చు గుణములు. కృషి తో అభ్యాసముతో కొందరు తమ గుణములను అధీనములో తీసుకురాగలిగిన వారు కలరు.

అయితే సత్వ గుణ ప్రధానము గా వుండి వేదాధ్యయన కార్యక్రమములో ఉండూ వారు బ్రాహ్మణులనీ , రజో గుణ ప్రధానముగా వుండి రాజ్యపాలన వ్యవహారములలో ఉండూ వారు క్షత్రియులనీ , రజో తమో గుణములు సమానముగావుండి కృషి గోరక్షణ వాణిజ్యములలో ఉన్న వారు వైశ్యులనీ , తమో గుణ ప్రధానమై పరిచర్యాదులలో ఉన్నవారు శూద్రులనీ చెప్పబదినది.

అయితే తమో గుణ ప్రధానముగా వుండి కష్టపడి ఆ తమోగుణమునే అదుపులో పెట్టి శమ దమాదులను సంపాయించి , వేదాధ్యయనములో మునిగిన వాడు బ్రాహ్మణుడే అవుతాడు , పుట్టినది తమోగుణ ప్రధానమై శూద్రుని వలెనే అయినా !

ఇది కృష్ణుడు చెప్పిన తాత్పర్యము.

కృష్ణుడు చెప్పినది తను ఏలా సృష్టించాడో అన్నది చెప్పడమే.

అలా అధ్యయన అభ్యాస తదుపరి కర్మలపై అధార పడవలసిన విభజన , వాటికి సంబంధములేకుండా పూర్తిగా వంశపారంపర్యము చేయడము అన్నది వర్ణముల వారు స్వలాభము కోసము చేసిన కార్యమే అని అనుకోడము సబబే అనిపిస్తుంది. ఇందులో ముఖ్యముగా లాభముకలిగినది బ్రాహ్మణ క్షత్రియ వర్ణములవారికి కనుక వాళ్ళే ఈ వర్ణ విభజన ద్వారా సంఘము భ్రష్టము అవడానికి కారకులు అని అనుకోవడము కూడా సబబే అనిపిస్తుంది.

అయితే ఎవరిదీ తప్పు అని తెలుసు కోవడము వలన లాభములేదు. కావలసినది వర్ణ విభజనకి పాతరవేసి దాని మీద సంఘపురోవృద్ధి.

భగవద్గీత మనకి చెప్పినది అందరికి ఒకటే మార్గము అని.

ఆ మార్గములో ఆడ మొగ రాజు రంకు బ్రాహ్మణుడు శూద్రుడు అన్న మాట రాదు .

అదే భగవద్గీత యొక్క ఘనత.

కృష్ణుడు కుండ బద్దలుకొట్టి చెప్పాడు- వేద వాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః - వేదమే పట్టుకొని తిరిగే వాళ్ళకి మోక్షములేదు.

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||